Ayurvedic foods: ఆయుర్వేద ఆహారం ప‌వ‌ర్ అంటే ఇదే మ‌రీ!


Ayurvedic foods:  మ‌నం నిద్ర లేచిన‌ప్ప‌టి నుండి అర్ధ‌రాత్రి దాకా ప‌రుగెత్తే యాంత్రిక జీవ‌నంలో చుట్టూ పొగ‌, ధూళి ర‌సాయ‌నాల‌తో క‌లుషిత‌మైన వాతావ‌ర‌ణంలో స‌గ‌టు మ‌నిషి నుండి మేధావిదాకా మంచి ఆహారాన్ని గుర్తించ‌డం క‌ష్ట‌మ‌వుతుంది. 

Ayurvedic foods

రోడ్డు మీద ఫాస్ట్ ఫుడ్ వంటి వాటి వ‌ల్ల పొట్ట పెర‌గ‌డం, మ‌లి వ‌య‌స్సులోనే షుగ‌రు వ్యాధి వంటివి రావ‌డం మిన‌హా మంచి జ‌ర‌గ‌డం లేదు. ఒక ప్రాంతాన్ని ఒక కాలాన్ని బ‌ట్టికాక విశ్వ‌స‌నీయ‌త‌తో ప్ర‌కృతిని పురుష‌త‌త్వాన్ని ఆక‌ళింపు చేసుకుని ప్ర‌కృతికి స‌మీపంగా ఆహార నిర్మాణం, నియ‌మావ‌ళి పాటించేదే ఆయుర్వేద శాస్త్రం. 

Ayurvedic foods: ఆయుర్వేద ఆహారం ప‌వ‌ర్ అంటే ఇదే మ‌రీ!

అమ్మ చేసిన సున్నివుండ‌లో వీర్య‌బ‌లం ఉంది. నువ్వుల వుండ‌లో స్త్రీ హార్మోన్ల‌ను క్ర‌మ‌ప‌రిచే శ‌క్తి ఉంది. పాయ‌సంలో తృప్తినిచ్చే గుణం ఉంది. పాలు, నెయ్యి, తేనె మ‌ధుర ప‌దార్థాలే కాదు, నిత్య జీవ‌ర‌సాయ‌నాలు అంటే స‌ప్త‌ధాతువుల‌కు శ‌క్తిని ఇచ్చేవి.

అన్నం బ్ర‌హ్మ స్వ‌రూపం, ర‌సం విష్ణు స్వ‌రూపం. భోజ‌నం చేసే త‌ను మ‌హేశ్వ‌ర రూప‌మ‌ని భావించి అన్నం ప్రాణ‌మ‌య‌మ‌ని మంచి మ‌న‌స్సుతో, ఆనందంలో స‌మ‌యాన్ని అనుస‌రించి తీసుకోవాలి. ఉద‌యం 9-12 గం. మ‌ధ్య , సాయంత్రం 7-10 గంట‌లు మ‌ధ్య ఆహారాన్ని తీసుకోవ‌డం మంచిది. ఆయుర్వేదం (Ayurvedic) ప‌థ్యాన్ని ప్ర‌తిపాదిస్తుంది. ప‌థ్యం మ‌నిషికి కాదు అత‌ని త‌త్వానికి, అత‌నికున్న రోగానికి. ఆహార ప‌దార్థాల‌లో ఉండే ర‌స‌శ‌క్తిని బ‌ట్టి ప‌థ్యం ఉంటుంది. 

ఉదాహ‌ర‌ణ‌కి అర‌టిపండు, దోస‌కాయ త‌ప్ప దానిమ్మ‌, చెర‌కు వంటివి ఆహారం ముందు తినాలి. నేరేడు, కొబ్బ‌రి, మామిడిపండు, ప‌న‌స‌, అర‌టిపండు వంటివి ఉద‌య‌మే తీసుకోకూడ‌దు. తీపి పిండి వంట‌లు అటుకుల‌తో చేసిన‌వి భోజ‌నాంత‌ర‌మే తినాలి. ఇదీ ప‌థ్య‌మంటే. 

ఆహారం యొక్క రుచుల అర్థం ఏమిటి?

ఆహారం కూడా మందు లాంటిదే. దానికి ర‌సం అంటే రుచి, వీర్యం అంటే బ‌లం వంటివి ఉంటాయి. ఈ రుచులు ఆరు. తీపి, కారం చేదు, ఉప్పు, వగ‌రు, పులుపు. మ‌న ఆహారంలో ఈ ఆరు రుచులు ఉండాలి. తీపి ప‌దార్థాలు మ‌న‌లో ఓజోశ‌క్తిని పెంచుతాయి. కారం, పులుపు జీర్ణ‌శ‌క్తిని, చేదు జ్ఞాప‌క‌శ‌క్తిని, ర‌క్త‌శోధ‌న‌ని క‌లుగ‌జేస్తుంది. వ‌గ‌రు క‌ఠిన ప‌దార్థాల‌ను ముక్క‌లు చేస్తుంది. ఉప్పు ఆహారానికి రుచిని ఇస్తుంది. 

గ‌ట్టిగా ఉండే రొట్టెలు, చ‌పాతీలు వంటివి అన్ని కూర‌ల‌తో ముందుగా తినాలి. అన్నం (FOOD) త‌ర్వాత తినాలి. ప‌ల్చ‌ని మ‌ధుర ప‌దార్థాలు అన్నం ముందు తినాలి. కారం, పులుపు ప‌దార్థాలు మ‌ధ్య‌లో తినాలి. వ‌గ‌రు చేదు ప‌దార్థాలు చివ‌ర‌న తిని మ‌జ్జిగ‌, ప‌ళ్ళ ర‌సాలు ఆఖ‌రున తినాలి. అన్ని కూర‌లు వేసిన పులుసుని అమెరికాలో రిచ్ వెజిట‌బుల్ సూప్ అని అంటారు. దీన్ని వారానికి ఒక్క‌సారైనా తీసుకోవ‌డం మంచిది. 

మిరియాలు, ధ‌నియాలు వేసిన చారు ప్ర‌తిరోజూ తీసుకోవ‌డం హిత‌క‌రం. అన్ని ఆహార ప‌దార్థాలు క‌లిపి తీసుకోకూడ‌దు. అది హానిచేస్తుంది. ఇటువంటి ఆహారాన్ని విరుద్ధాహార‌మంటారు. ఉదాహ‌ర‌ణకి పెరుగు, నెయ్యి క‌లిపి తీసుకోకూడ‌దు. అర‌టి పండు, పాలు ఒకేసారి తీసుకోకూడ‌దు. వేడి కాఫీ, టీల‌లో తేనె క‌లుపుకోకూడ‌దు. వెన్న‌తో చేప‌ని వండుకోకూడ‌దు. 

ఋతువుల‌ను అనుస‌రించి పండే ప‌ళ్ల‌ను తీసుకోవ‌డం మంచిది. అలా కాకుండా తీసుకుంటే ఆమం త‌యారువుతుంది. ఆమం అంటే జీర్ణం కాక నిలువ ఉండిపోయిన విష‌ప‌దార్థ‌మ‌న్న‌మాట‌. అదే మోకాళ్ల‌నొప్పుల వంటి వ్యాధుల‌కి కార‌ణం అవుతుంది. ఉదాహార‌ణ‌కి వేస‌వికాలంలో జీర్ణ‌శ‌క్తి మ‌న‌లో త‌క్కువ‌గా ఉంటుంది. అందువ‌ల్ల తేలిక‌పాటి ఆహారం రెండు మూడుసార్లు తీసుకోవ‌డం మంచిది. 

రాత్రి పెరుగు వేసుకోకూడ‌దు. ఎందుకంటే అది పూర్తిగా జీర్ణంకాక శ్రోత‌స్సుల‌ని మూసేస్తుంది. వ‌య‌స్సుని బ‌ట్టి కూడా ఆహారం ఇవ్వాలి. పిల్ల‌లు ఎదిగే వ‌య‌స్సు క‌నుక శ‌రీరం, మ‌న‌స్సు ఎదిగే ఆహారాన్ని ఇవ్వాలి. యవ్వ‌నంలో ఉండేవాళ్ల‌కి మెటాబాలిజ‌మ్ & కెటాబాలిజ‌మ్ స‌మానంగా ఉంటాయి. క‌నుక శ‌క్తినిచ్చే ప్రొటీన్లు, విట‌మిన్లు ఉన్న ఆహారం ఇవ్వాలి. 

సాత్వికాహారం అంటే పూర్తి శాఖాహారం, రాజాసాహారం అంటే మాంసాహారం, ఎక్కువ కారం, మ‌సాలా వున్న‌ది, తామ‌సాహారంఅంటే నిలువ వున్న‌వి, చ‌ల్లారిన‌వి. వీటిని బ‌ట్టి కూడా మ‌న ప్ర‌వ‌ర్త‌న మారుతూ ఉంటుంది. అన్నింటికీ మించి ఎప్పుడూ ముందు తీసుకున్న ఆహారం జీర్ణం కాకుండా మ‌ళ్లీ ఆహారం తీసుకోకూడ‌దు. 

అన్నం మొద‌టి ముద్ద‌లో పాత ఉసిరిప‌చ్చ‌డి తిన‌డం హిత‌కరం. ధ‌నియాల పొడితో మ‌లి ముద్ద తిన‌డం మ‌రీ మంచిది. పిల్ల‌ల‌కి రాత్రి ప‌రుండే ముందు ప‌టిక‌బెల్లం పొడి క‌లిపిన పాలు ఇవ్వ‌డం అమృతం ఇవ్వ‌డం లాంటిది. మీరు నిద్రించే స‌మ‌యానికి మీరు తీసుకున్న ఆహారం (Ayurvedic foods) అన్నం కొంచెం జీర్ణ‌మ‌వ‌డం చాలా మంచిది. అన్నం తిన్న‌వెంట‌నే సంసార‌సుఖం పొంద‌కండి. తిన్న వెంట‌నే క‌నీసం ప‌ది అడుగులు న‌డ‌వండి. 

0 comments:

Post a Comment